-->

హరప్పా నాగరికత - ప్రధాన లక్షణాలు || Harappan Civilization - Major Features

Also Read



    మీరు భారతీయ చారిత్రక పూర్వ సంస్కృతుల గురించి గత పాఠంలో చదువుకున్నారు. రాగి లేదా ఇత్తడి వస్తువులను ఉపయోగించిన ఈ సంస్కృతులు చాలా వరకు గ్రామీణమైనవి. అయితే రాతిని ఉపయోగించిన స్థలాలను పరిగణించినట్లయితే ఈ సంస్కృతి భారతదేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించిందని తెలుస్తోంది. వీరికి రాగిని తగరంలో కలిపి కంచు తయారుచేసే విధానం తెలియదు. అంతేకాక వీరికి 'లిపి' పై కూడా అవగాహన లేదు. అయితే ఈ వస్తువులను వాడిన సింధూనాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత. రాగి కన్నా బలమైన, ఉపయోగకరమైన కంచు వస్తువులను ఉపయోగించారు. 'లిపి' పై అవగాహన కలిగిన ఈ నాగరికత భారతఖండంలోని పశ్చిమోత్తర భాగంలో విలసిల్లిన మొట్టమొదటి నాగరికతగా భావిస్తున్నారు.
    భారతదేశంలోని శిలా-లోహ యుగ సంస్కృతుల కన్నా ఈ హరప్పా సింధూ నాగరికత చాలా ప్రాచీనమైనది. అయినప్పటికీ సాంకేతికంగా ఇతర విషయాలలో చాలా ప్రగతి దాయకమైనది. దీనినే హరప్పా నాగరికత అని కూడా అంటారు. క్రీ.శ.1921లో హరప్పా దగ్గర ఈ నాగరికతను కనుగొన్నందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇది ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ పశ్చిమ ప్రాంతంలో ఉంది.
    హరప్పా ప్రజలు ప్రణాళికాబద్దంగా నిర్మించిన నగరాలలో నివసిస్తూ 'లిపి' ని అభివృద్ధి చేశారు. అయితే నేటికి ఆ లిపిని చదవలేకపోతున్నారు. నిపుణులైన వృత్తి పనివారుగా ఉన్న హరప్పా ప్రజలు వ్యవసాయ రంగంలో కూడా ప్రగతి సాధించారు. ఇంకా వారు మెసపటోమియాలోను, పశ్చిమాసియాలోని మరికొన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలను కల్గి ఉన్నారు. క్రీ.పూ. 2500 ప్రాంతంలో ఈజిప్ట్ లోని నైలునది లోయ, యూఫ్రటీస్, ట్రైగ్రీస్ పరీవాహక ప్రాంతం, చైనా లో హొయాంగ్ హో, మధ్యధరా, ఏజియన్ సీ పరీవాహక ప్రాంతాలతో పాటు సింధూ నది పరివాహక ప్రాంతం కూడా నాగరికతకు కేంద్రంగా అభివృద్ధి చెందింది.

Close