-->

మూడు చేపలు కథ - Three Fishes Story in Telugu - Telugu Moral Story

Also Read

మూడు చేపలు

[ జననం 1891. నవలలు, నాటకాలూ, ఆత్మకథా, వ్యాసాలూ, వైద్య శాస్త్ర సంబంధరచనలూ ఎన్ని చేసినా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనగానే ఆయన కథలే జ్ఞాపకం వస్తాయి. చేయి తిరిగిన కథకు డాయన. గజమెత్తు పుస్తకాలు రాసి తెలుగువాడి కందివ్వాలన్న తపనతో. రచనలు చేశాడు. 'వడ్ల గింజలు', 'గులాబీ అత్తరు', 'మార్గదర్శి', 'ఇలాంటి తవ్వాయి వస్తే' మొదలైన కథలు, 'రక్షాబంధనము', 'ఆత్మబలి' మొదలైన నవలలూ, 'రాజరాజు', 'కలంపోటు' మొదలైన నాటకాలూ రాశారు. ఆయన 'అనుభవాలూ జ్ఞాపకాలూను' ఆత్మకథ. ఈ పాఠ్యాంశం ఆయన రచించిన పురాణ గాథలలోది.]


    ఒక మడుగున మూడు చేపలు గలవు. అందొకదాని పేరు దీర్ఘదర్శి. మరొకదాని పేరు ప్రాప్త కాలజ్ఞుడు. వేరోకదాని పేరు దీర్ఘసూత్రుడు. అవి ఆ మడుగున సుఖముగా కాలము గడపుచుండగా వేసవి కాలము సమీపించెను. అప్పుడు దీర్ఘదర్శి తక్కిన రెంటిని చూచి " ఈ మడువు చాల చిన్నది. వేసవి వచ్చుచున్నది. ఈ మడువు అంతయు ఇంకిపోవును. అప్పుడు మనము ఎటు పోవుటకును "వీలుండదు; కనుక ఎప్పుడును ఎండిపోని పెద్ద మడువు చూచుకొని ఇప్పుడే దానిలోనికి పోవుదము” అని చెప్పెను.
    ఇది విని ప్రాప్తకాలజ్ఞుడు " వేసవి వచ్చునను కొందము. అయిన నీ మడుగు ఇంకిపోవునని ఎట్లు చెప్పవచ్చును ? అట్లు గాక, ఇంకిపోవుటయే నిజమగునెడల అప్పటికేదో యుపాయము. తోచక పోవునా ? ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉన్నది. ఇక ఇక్కడ నుండగూడదను నీ మాట నాకు యుక్తి యుక్తముగా కనపడుటలేదు. ఎప్పుడో కష్టము వచ్చునేమో అని ఇప్పుడు చక్కని నివాసము విడిచిపోవుట మంచిది కాదు ", అని దృఢముగా చెప్పెను.
    ఇదియు విని దీర్ఘసూత్రుండు " మీ మాటలు చాల అవకతవకగా ఉన్నవి. .మీ నీడను చూచుకొనియే మీరు భయపడుచున్నారు. ఈ మడుగు మహాసముద్రమువలె అపారముగా ఉన్నది. ఒకటి కాదు, వేసవులు ఒక్కమాటుగా వచ్చినను ఇది యెండిపోదు. ఇది ఎండిపోవుననుకొనుటకంటె అవివేకము లేదు. .ఏదో తలచికొని దీర్ఘదర్శి భీతిల్లుచున్నాడు. చక్కగా ఆలోచించకుండ తొందరపడి ఏమియు చేయరాదు. కనుక మనము ఇప్పుడు ఇక్కడనుండి కదలుట మనకు ఎంతమాత్రమును శ్రేయస్కరము కాదు అని చెప్పెను. "
    దీర్ఘదర్శికి ఈ మాటలు నచ్చలేదు. వేసవిలో ఇక్కడ ఉండుట అపాయకరము అనియే అది నిశ్చయించుకొనియెను. వెంటనే అది “ మీ మాటలు వినిన చెడిపోవుట తప్పదు, మీరును వచ్చెదరా, సరియే. లేకున్న నేను వెడలిపోక మానను". అని వాటితో, దృఢముగా..చెప్పి బయలుదేరేను.
    మొదట అది ఆ మడుగు లోనికి నీరు వచ్చే పిల్ల కాలువలో ప్రవేశించెను. దానిలోనుండి పెద్ద కాలువలో ప్రవేశించెను. దానిలోనుండి సముద్రము వలెనున్న ఒక పెద్ద మడుగులో ప్రవేశించి అందు నిశ్చింతగా ఉండెను.
    ఇంతలో వేసవి వచ్చెను. క్రమక్రమముగా ఎండలు ముదిరిపోయెను. ఒక్కొక్క చెఱువే, ఒక్కొక్క మడుగె ఎండిపోవసాగెను.
    మఱి కొన్ని దినములకు వలలు పట్టుకొని వచ్చి జాలరులు ఆ మడుగు చొచ్చిరి.
    తప్పించుకొనుటకు ఎంత ప్రయత్నించినను ఒక్కొక్క చేపయే వారికి దొఱికిపోవుచుండెను. దొబికిన వానినన్నిటిని, వారు ఒక త్రాటికి గ్రుచ్చసాగిరి. అది చూచి ప్రాప్తకాలజ్ఞుడు " పెద్ద చిక్కే వచ్చినది. దీర్ఘదర్శి చెప్పిన మాట వినకపోయితిని. అయినను ఇప్పుడు అట్లు తల్లడిల్లుచు కూర్చుండుట మంచిదికాదు. ఉపాయము చూడవలెను” అని తీవ్రముగా ఆలోచింపసాగెను.
    ఇంతలో చేపలు గ్రుచ్చిన త్రాడు మొలలో దోపుకొని ఊతతో నక్కడ కొకజాలరి వచ్చెను. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు " నేనిప్పుడు ఆ త్రాటిని కరచి పట్టుకొని యుండెద. జాలరి నన్ను చూచెనేని గ్రువ్వబడిన చేపయే అనుకొనును. పిదప వాడు వెడలిపోవునపుడు మంచిమడుగు చూచి అందు ఉటికి తప్పించుకొనియెదను” అని తలచి అట్లు చేసెను.
    తప్పించుకొనుటకు ఉపాయము తోచక మిడుకు చుండగా దీర్ఘసూత్రుని ఒక జాలరివాడు పట్టుకొని తన బుట్టలో వేసికొనిపోయెను.
    ఆ మడుగు నందలి చేపలు అన్నియు అయిపోగా జాలరివాండ్రు ఇండ్లకు బయలుదేఱిరి. దారిలో ఒక పెద్దకాల్వ కనబడగా వారు బురదకొట్టియున్న చేపలు కడుగుటకు అందు దిగిరి. ప్రాప్తకాలజ్ఞుడు వెంటనే ఆ త్రాటిని విడిచి పెట్టి జాలరులకు అందకుండ కాల్వలో మునిగి తప్పించుకొనియెను.

-శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

Close