-->

విజయనగర సామ్రాజ్యం - Complete History of the Kings of the Vijayanagara Empire - Empire of Vijayanagar

Also Read

విజయనగర సామ్రాజ్యం

హరిహర, బుక్కరాయలు విద్యారణ్య స్వామి సాయంతో 1336లో తుంగభద్ర నదీ తీరంలోని అనెగొందిని రాజధానిగా చేసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విద్యారణ్యస్వామి పేరుమీదుగా విద్యానగరం/ విజయనగరాన్ని నిర్మించి, 1344లో రాజధానిని అనెగొంది నుంచి విజయనగరానికి మార్చారు. ఈ సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీడు వంశాలు పరిపాలించాయి. వీరి చరిత్రకు సంబంధించిన ఆధారాలను పురావస్తు, సాహిత్య ఆధారాలుగా విభజించవచ్చు. శాసనాలు, నాణేలు, కట్టడాలు లాంటి పురావస్తు ఆధారాలతోపాటు దేశీయ, విదేశీ రచనలు కూడా వీరి చరిత్రను తెలుసుకోవడానికి తోడ్పడుతున్నాయి.

శాసనాలు

  • మొదటి హరిహరరాయల విజయాలను భాగ పెల్సి తామ్ర శాసనం తెలియజేస్తుంది. రెండో సంగముడి బిట్రగుంట దాన శాసనం, రెండో హరిహరుడి చెన్నరాయ పట్టణ శాసనం, రెండో దేవరాయల శ్రీరంగం తామ్ర శాసనాలు, ఇమ్మడి నరసింహ రాయలు వేయించిన దేవులపల్లి తామ్ర శాసనాలు, శ్రీకృష్ణదేవరాయల హంపి, మంగళగిరి, కొండవీడు శాసనాలు విజయనగర రాజుల చరిత్రకు ప్రధాన ఆధారాలు.

నాణేలు

  • విజయనగర కాలంలో ప్రధాన బంగారు నాణెం 'గద్యాణం'. దీన్నే వరహా అనేవారు. ప్రతాప, ఫణం, చిన్నం అనే బంగారు నాణేలు కూడా చలామణిలో ఉండేవి. తార్ అనే వెండి నాణెం, జిటాలు, కాసు అనే రాగి నాణేలు. రెండో దేవరాయలు వేయించిన పావలా వరహాలపై గజబేటకార బిరుదు ఉంది.

దేశీయ సాహిత్యం

  • విజయనగర యుగంలో తెలుగు, సంస్కృత, కన్నడ, తమిళ భాషల్లో అనేక రచనలు వెలువడ్డాయి. గంగాదేవి మధురా విజయం, తిరుమలాంబ వరదాంబికా పరిణయం, రెండో దేవరాయలు మహానాటక సుధానిధి, రెండో రాజనాథ డిండిముడి సాళువాభ్యుదయం, అష్టదిగ్గజాల రచనలు నాటి చరిత్రను తెలియజేస్తున్నాయి.

విదేశీ రాయబారులు, యాత్రికుల వర్ణనలు

  • విజయనగర సామ్రాజ్యాన్ని అనేకమంది విదేశీ యాత్రికులు, రాయబారులు సందర్శించి నాటి ఆర్థిక, సాంఘిక, మత, సాంస్కృతిక అంశాలను తమ రచనల్లో వర్ణించారు. మొదటి హరిహరరాయల కాలంలో మొరాకో దేశానికి చెందిన ఇబన్ బటూటా, మొదటి దేవరాయల కాలంలో ఇటలీకి చెందిన నికోలో కాంటె, రెండో దేవరాయల కాలంలో అబ్దుల్ రజాక్ అనే పారశీక రాయబారి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు.
  • శ్రీకృష్ణ దేవరాయల కాలంలో డొమింగో పెయిజ్, బార్బోసా (పోర్చుగీసువారు), వర్గెమా (ఇటలీ) లాంటి వారు వచ్చారు. అచ్యుత రాయల కాలంలో న్యూనిజ్ , రెండో విరూపాక్ష రాయల కాలంలో అథనేషియన్ నికెటిన్ (రష్యా) విజయనగర రాజ్యాన్ని సందర్శించారు.
  • బహమనీ రాజ్యంలో ఉన్న పెరిస్టా అనే పర్షియన్ చరిత్రకారుడు కూడా విజయనగర రాజుల చరిత్రను తన రచనల్లో పేర్కొన్నాడు. రాబర్ట్ సూయల్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు తన 'ఏ ఫర్ గాటెన్ ఎంపైర్' అనే పుస్తకంలో విజయనగర సామ్రాజ్య ఉన్నతి,  పతనాల గురించి వివరించాడు.

రాజకీయ చరిత్ర

విజయనగర సామ్రాజ్యాన్ని తొలుత పాలించింది. సంగమ వంశీయులు. సుమారు 150 సంవత్సరాలపాటు 15 మంది సంగమ వంశ చక్రవర్తులు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. బావసంగముడి కొడుకులైన హరిహర, బుక్కరాయలు సంగమ వంశ రాజ్యపాలనను ప్రారంభించారు. ఈ వంశంలో గొప్పవాడు రెండో దేవరాయలు, చివరివాడు రెండో ప్రౌడ దేవరాయలు.
  • 1336లో హరిహర, బుక్కరాయలు తుంగభద్రా నదీతీరంలో విరూపాక్షస్వామి పేరున స్వతంత్ర రాజ్యస్థాపన చేశారు.
  • 1347లో మొదటి హరిహరరాయల కాలంలోనే బహమనీ సామ్రాజ్య స్థాపన జరిగింది.
  • 1336, ఏప్రిల్ 18న మొదటి హరిహరుడి పట్టాభిషేకం జరిగింది. ఇతడి కాలంలో ఇబన్ బటూటా అనే మొరాకో దేశీయుడు రాజ్యాన్ని సందర్శించాడు.
  • బాదామీ శాసనంలో మొదటి హరిహరుడిని పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర బిరుదుతో ప్రస్తావించారు. ఇతడు భాగ పెల్సి, అటకల గూడు శాసనాలను వేయించాడు. 

మొదటి బుక్కరాయలు

మొదటి హరిహరుడి తర్వాత మొదటి బుక్కరాయలు (1356 - 77) పాలనకు వచ్చాడు. ఇతడి కాలంలోనే విజయనగర బహమనీ సంఘర్షణలు (1367) ప్రారంభమయ్యాయి.
  • ఇతడి ఆస్థాన కవి నాచన సోముడు ఉత్తర హరివంశం, ఆంధ్ర భాషా చరిత్ర లాంటి గ్రంథాలను రచించాడు. మొదటి బుక్కరాయలు నాచన సోముడికి పిచ్చుకల దిన్నె/ పంచాకుల దిన్నె గ్రామాన్ని దానం చేసి, శాసనం వేయించాడు. ఇతని కుమారుడు కంపన మధురపై దండెత్తి సాధించిన విజయాన్ని కోడలు గంగాంబ తన 'మధురా విజయం'లో పేర్కొంది.
  • చైనా దేశానికి వర్తక బృందాన్ని పంపిన విజయనగర రాజు మొదటి బుక్కరాయలు. ఇతడి ఆస్థానంలో ఉన్న సాయణుడు, మాధవుడు మంత్రులుగా, కవులుగా పేరొందారు.

రెండో హరిహర రాయలు

మొదటి బుక్కరాయలు అనంతరం రెండో హరిహరరాయలు (1377 1404) పాలనకు వచ్చాడు. రాజాధిరాజ, రాజ పరమేశ్వర, రాజవ్యాస, రాజవాల్మీకి లాంటి బిరుదులను పొందాడు. చెన్నరాయ పట్టణ శాసనం, యనమదల శాసనాలను వేయించాడు. కాటయ వేమారెడ్డి చేతిలో ఓడిపోయి, అతడికి తన కుమార్తె హరిహరాంబికను ఇచ్చి పెళ్లి చేశాడు. ఇతడి కాలంలోనే దుర్గాదేవి కరవుగా పేరొందిన తీవ్రమైన కరవు సంభవించింది. మొదటి వారసత్వ యుద్ధం (రెండో బుక్కరాయలు, మొదటి విరూపాక్షరాయల మధ్య, ఇతడి అనంతరమే ప్రారంభమైంది. రెండో దేవరాయల గురువైన శవణాచారి అలంకార సుధానిధి అనే గ్రంథాన్ని రచించాడు.
  • మొదటి విరూపాక్ష రాయలు, రెండో బుక్కరాయల అనంతరం మొదటి దేవరాయలు రాజయ్యాడు. 

మొదటి దేవరాయలు

మొదటి దేవరాయల కాలం (1406 22) లోనే కంసాలివాని కుమార్తె యుద్ధం బహుమనీ సుల్తాన్ ఫిరోజ్ షాతో జరిగింది. ఇతడి కాలంలో తుంగభద్రా నదికి ఆనకట్ట, విజయనగరం చుట్టూ బురుజులు నిర్మించారు. మార్కొండపాడు, పరుచూరు శాసనాలు వేయించాడు. ఇతడి కాలంలో నికోలో కాంటె ఈ రాజ్యాన్ని సందర్శించాడు.
  • మొదటి దేవరాయలు అనంతరం కుమారుడు రామచంద్ర రాయలు, అనంతరం అతడి రెండో కుమారుడు విజయరాయలు పరిపాలించారు.

రెండో దేవరాయలు (1426-46)

గజబేటకార, ప్రౌడ దేవరాయలు, దక్షిణ సముద్రాధీశ్వరుడు లాంటి బిరుదులను పొందాడు. ప్రభులింగలీల గ్రంథాన్ని రచించిన చామరసును పోషించాడు. ఆస్థాన కవి అరుణగిరినాథ డిండిమభట్టును ఓడించిన శ్రీనాథుడికి గండపెండేరాన్ని తొడిగి, కవి సార్వభౌమ బిరుదును ప్రదానం చేశాడు. రెండో దేవరాయలు మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని రచించాడు. 1443లో ఇతడి ఆస్థానానికి పారశీక రాయబారి అబ్దుల్ రజాక్ వచ్చాడు.
  • రాజధానిలో జైనులకు ఆరామాలను కట్టించాడు. సింహాసనం ముందు ఖురాన్ ను ఉంచేవాడు. రెండో దేవరాయల అనంతరం మల్లిఖార్జున రాయలు, రెండో విరూపాక్ష రాయలు, రెండో ప్రౌడ దేవరాయలు వరుసగా పాలించారు.
  • చివరి పాలకుడైన రెండో ప్రౌడ దేవరాయలను బంధించి, సేనాని సాళువ నరసింహ రాయలు సింహాసనాన్ని ఆక్రమించాడు.

సాళువ వంశం (1485-1505)

సాళువ వంశస్థులు కళ్యాణ పురమాధీశ్వర బిరుదు ధరించారు. వంశమూల పురుషుడైన మంగి రాజుకు ప్రతిపక్ష సాళువ అనే బిరుదు ఉంది. సాళువ నరసింహుడు రెండో ప్రౌడ దేవరాయలను బంధించి, అధికారాన్ని హస్తగతం చేసుకుని విజయనగర చరిత్రలో తొలి దురాక్రమణదారుడిగా పేరొందాడు. అరబ్బుల నుంచి గుర్రాలను కొనడం ప్రారంభించిన తొలి విజయనగర రాజు సాళువ నరసింహుడే. సాముగారడీలు అనే యుద్ధ విద్యను ప్రోత్సహించాడు.
  • తాళ్లపాక అన్నమాచార్యులు, పిల్లలమర్రి పినవీరభద్రుడు లాంటి ప్రముఖులను పోషించాడు. పిల్లలమర్రి “వాణి నా రాణి” అని పలికాడు. అతను జైమినీ భారతం, శృంగార శాకుంతలం గ్రంథాలను రచించాడు.
  • సాళవ నరసింహుడి అనంతరం తమ్మరాజు, ఇమ్మడి నరసింహ రాయలు పాలకులుగా వ్యవహరించారు. కానీ అధికారం మాత్రం మంత్రి తుళువ నరసనాయకుడు చెలాయించేవాడు. చివరి సాళువ పాలకుడైన ఇమ్మడి నరసింహరాయల కాలంలో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు.

తుళువ వంశం (1505-70)

మైసూర్ లోని తుళు ప్రాంతం వీరి జన్మస్థలం. వంశ మూల పురుషుడు తిమ్మరాజు. తిమ్మరాజు కుమారుడు ఈశ్వర నాయకుడు 'దేవకీ పురాధిపుడు' అనే బిరుదు పొందినట్లు నంది మల్లయ, గంట సింగన రచించిన వరాహ పురాణం గ్రంథం పేర్కొంటోంది. తుళువ నరస నాయకుడి కుమారుడు వీర నరసింహుడు ఇమ్మడి నరసింహుడిని బంధించి, రాజ్యాన్ని ఆక్రమించాడు. వైవాహిక సుంకాన్ని రద్దు చేసిన తొలి విజయ నగర పాలకుడు వీర నరసింహుడే. కూచిపూడి భాగవతులు ఇతడి కాలంలోనే ప్రాచుర్యం పొందారు.

శ్రీ కృష్ణదేవరాయలు (1509 – 29)

1509, ఆగస్టు 8 శ్రీ జయంతి రోజున రాయల పట్టాభిషేకం జరిగింది. పోర్చుగీసు రాయబారి లూయీఫ్రేజర్ / ప్రేయర్ లూయీస్ రాయల పట్టాభిషేక మహోత్సవానికి హాజరయ్యాడు.
  • శ్రీకృష్ణ దేవరాయలు 1510లో పోర్చుగీసు గవర్నర్ ఆల్బూకర్క్ తో సంధి చేసుకుని, గోవా ఆక్రమణలో సాయపడి మేలుజాతి గుర్రాలను పొందాడు. కోవిలకొండ, దివానీ యుద్ధాల్లో బహమనీ సైన్యాలను ఓడించాడు. బీదర్ పాలకుడు మహమూద్ షాను ఖైదు నుంచి విడిపించి (ఆలీబరీద్ ను ఓడించి), యవనరాజ్య స్థాపనాచార్య బిరుదు పొందాడు. యూరోపియన్లతో తన సైన్యానికి శిక్షణ ఇప్పించిన తొలి దక్షిణ భారతదేశ రాజు శ్రీకృష్ణదేవరాయలు. శిక్షణ ఇచ్చింది, తూర్పు దిగ్విజయ యాత్రలో సాయపడింది క్రిష్టియన్ ఓడ్ ఫిగరిడో.
  • తూర్పు దిగ్విజయ యాత్రలో ఉదయగిరిని ఆక్రమించి, కొండమరుసయ్యను, కొండవీడును ఆక్రమించి తిమ్మరాజు పినకొండ్రాజును నియమించాడు. ఒరిస్సా ప్రతాపరుద్ర గజపతిని ఓడించి, సింహాచలం వద్ద ఉన్న పొట్నూరులో విజయ స్తంభాన్ని నాటాడు.
  • కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఉన్న ఆంధ్రమహావిష్ణు దేవాలయంలో బస చేసినప్పుడు వచ్చిన స్వప్నం కారణంగా ఆముక్త మాల్యద గ్రంథాన్ని తెలుగుభాషలో రచించాడు. ఆముక్తమాల్యద గ్రంథానికి మరొక పేరు విష్ణుచిత్తీయం. ఈ గ్రంథంలో పేర్కొన్న తమిళ కవయిత్రి ఆండాళ్.
  • రాయలు సింహాచల దేవాలయానికి ముఖమండపం, మంగళగిరి దేవాలయానికి మండపాలు, సోపనాలు నిర్మించాడు. ఇస్మాయిల్ ఆదిల్ షా (బీజాపూర్)తో గొబ్బూరు, రాయచూర్ యుద్ధాల్లో విజయం సాధించాడు. శ్రీకృష్ణ దేవరాయలు నాగులాపురం పట్టణం, నాగులాపురం చెరువు నిర్మించాడు.
  • ఆస్థానంలో భువన విజయం పేరుతో అష్టదిగ్గజాలు అనే కవి పండితులను పోషించాడు. హంపిలో హజారా రామాలయం, విఠలస్వామి దేవాలయాలు నిర్మించాడు.
  • శ్రీకృష్ణ దేవరాయలు పూర్తి ఇస్లామిక్ పద్ధతిలో పద్మమహల్ ను నిర్మించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికి తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశాడు.
  • శ్రీకృష్ణ దేవరాయల వైష్ణవ మత గురువు వ్యాసరాయలు. రాయల ఆస్థానాన్ని వల్లభాచార్యుడు సందర్శించాడు. రాయల ఆస్థానంలో ఉన్న బండారు లక్ష్మీనారాయణ సంగీత సూర్యోదయం గ్రంథాన్ని రాశాడు. తుంగభద్రా నదిపై తూరుట్టు ఆనకట్టను, కావేరి నది పై కొరగల్లు ఆనకట్టను పోర్చుగీసు ఇంజినీర్ల సహాయంతో నిర్మింపజేసాడు.

అచ్యుతరాయలు (1520 - 42)

శ్రీకృష్ణ దేవరాయల అనంతరం అచ్యుత రాయలు తిరుపతిలో పట్టాభిషేకం జరుపుకుని, పాలకుడయ్యాడు. ఇతడు గజపతులను
ఓడించినట్లు రాధామాధవ కవి రచన తారకాభ్యుదయం పేర్కొంటోంది. బావమరుదులైన సలకంచిన, పెద తిరుమలుల సహాయంతో తిరుగుబాట్లను అణిచాడు. అచ్యుతరాయల ఆస్థాన నర్తకి వరదాంబిక.
  • వరదాంబికా పరిణయం గ్రంథ రచయిత్రి  - తిరుమలాంబ
  • అచ్యుత రాయల ఆస్థానాన్ని న్యూనిజ్ , కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు సందర్శించారు.

సదాశివరాయలు (1542-70)

అచ్యుతరాయల అనంతరం సదాశివరాయలను రాజుగా (గుత్తిదుర్గంలో) ప్రకటించారు. అధికారం అంతా శ్రీకృష్ణ దేవరాయల అల్లుడైన అళియరామరాయల చేతిలో ఉండేది.
  • అళియ రామరాయలు తురకవాడలో గోవధను అనుమతించాడు. ఇతడి కాలంలోనే విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన తళ్లికోట యుద్ధం (1565) జరిగింది. తళ్లికోట యుద్ధం/ రాక్షసి తంగడి యుద్ధం గురించి కేలదినృపవిజయం గ్రంథం వివరిస్తోంది. ఈ యుద్ధంలో అళియరామరాయలు మరణించగా, తిరుమలరాయలు సదాశివరాయలను తీసుకుని పెనుగొండకు పారిపోయాడు.

అరవీడు వంశం (1570 - 1680)

సదాశివరాయల అనంతరం తిరుమలరాయలు పెనుగొండ రాజధానిగా అరవీడు వంశపాలన ప్రారంభించాడు. అతడి అనంతరం మొదటి శ్రీరంగరాయలు, రెండో వెంకటపతిరాయలు, రెండో శ్రీరంగరాయలు, రామదేవరాయలు, మూడో వెంకటపతిరాయలు, మూడో శ్రీరంగరాయలు వరుసగా పాలించారు. రామరాజభూషణుడు తన వసుచరిత్ర గ్రంథాన్ని తిరుమలరాయలకు అంకితం చేశాడు.
  • మొదటి శ్రీరంగరాయల కాలంలో కోడూరు యుద్ధం (1579) జరిగింది. రెండో వెంకటపతిరాయల కాలంలో రాజధానిని పెనుగొండ నుంచి చంద్రగిరికి, తర్వాత వెల్లూరుకు మార్చారు. రెండో వెంకటపతిరాయల రెండో శ్రీకృష్ణదేవరాయలు/ రెండో ఆంధ్రభోజుడిగా పేరుగాంచాడు. తెనాలి రామలింగడు తన పాండురంగ మాహాత్మ్యం గ్రంథాన్ని రెండో వెంకటపతిరాయలకు అంకితం ఇచ్చాడు. రెండో శ్రీరంగరాయల కాలంలో తోపూరు యుద్ధం (1616) జరిగింది.
  • దక్షిణ భారతదేశంలో పెద్దఎత్తున ఫిరంగులు వాడిన యుద్ధం తోపూరు యుద్ధం. మూడో వెంకటపతిరాయల కాలంలోనే దామెర్ల సోదరులు మద్రాస్ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇచ్చారు.
  • చివరి విజయనగర పాలకుడు మూడో శ్రీరంగరాయలు ఇతడి కాలంలోనే వెంగల్లు, వెల్లూరు, వందవాసి యుద్ధాలు జరిగాయి. 1680 నాటికి విజయనగర సామ్రాజ్యం పూర్తిగా అంతరించింది.

Close