-->

రాష్ట్రాల ఆర్థిక నిర్వహణలో... కేంద్రానికీ సంబంధం ఉంటుంది - April 2024 Current Affairs.

Also Read



రాష్ట్రాల ద్రవ్య నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నట్లయితే అది జాతీయ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది కనుక ఈ అంశంతో కేంద్ర ప్రభుత్వానికీ సంబంధం ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రుణ సేకరణపై పరిమితి విధింపు విషయంలో తమ మధ్య నెలకొన్న విభేదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కేరళ, కేంద్ర ప్రభుత్వాలకు సూచించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ రుణ సేకరణ యత్నాలకు కేంద్రం అడ్డుతగులుతోందని ఆరోపిస్తూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. . వ్యాజ్యం పెండింగ్లో ఉన్నంత మాత్రాన చర్చలు, సంప్రదింపులను నిలిపివేయ వద్దని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం ఉభయ పక్షాలకూ హితవుపలికింది. నిర్ణయం తీసుకోవడంలో భాగస్వాములైన సీనియర్ అధికారులు అందరూ సమస్య పరిష్కారానికి యత్నించాలని తెలిపింది. సహకార సమాఖ్య స్ఫూర్తితో సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉన్నప్పటికీ కేంద్రం వైఖరి వల్ల అది సాధ్యం కావడంలేదని కేరళ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్సిబల్ పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి తక్షణ ఉపశమనం అవసరమని తెలిపారు. అదనపు రుణ సేకరణకు విధించిన షరతులను కేంద్రం ఎత్తివేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం అధికారాన్ని ప్రశ్నిస్తూ కేరళ దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంటేనే రాష్ట్ర అభ్యర్థనను పరిశీలిస్తామంటూ అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ ఇదివరకు అందజేసిన నోట్పై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది.

Close