-->

వేడెక్కుతున్న ఉత్తర భారతం - ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్. పర్యావరణం - April 2024 Current Affairs. environment

Also Read



ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోందని అమెరికన్ శాస్త్రజ్ఞుల బృందం క్లైమేట్ సెంట్రల్ హెచ్చరించింది. ఈ బృందం 1970 నుంచి డిసెంబరు-ఫిబ్రవరి కాలంలో ఉత్తర భారత్లో ఉష్ణోగ్రతల తీరుతెన్నులను విశ్లేషించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనవరి నెలలో ఉష్ణోగ్రత కాస్త ఎక్కువ చల్లబడటం కానీ, కాస్త ఎక్కువ వెచ్చబడటం కానీ జరుగుతున్నా ఫిబ్రవరిలో మాత్రం సగటుకు మించి ఉష్ణోగ్రత పెరుగుతోందని తేల్చింది. మార్చిలో కనపడాల్సిన ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలోనే నమోదవుతున్నాయి. రాజస్థాన్లోనైతే ఫిబ్రవరి సగటు ఉష్ణోగ్రత జనవరి కన్నా 2.6 సెల్సియస్ డిగ్రీలు ఎక్కువగా నమోదవుతోంది. ఉత్తరాన లద్దాఫ్, జమ్మూ-కశ్మీర్, ఉత్తరాఖండ్లతో సహా మొత్తం తొమ్మిది రాష్ట్రాలలో జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య 2 డిగ్రీల తేడా కనిపిస్తోంది. దీన్ని బట్టి పలు ఉత్తర రాష్ట్రాల్లో వసంతం అదృశ్యమైనట్లే భావించాల్సి వస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ డిసెంబరు-ఫిబ్రవరి మధ్య కాలంలో సగటు ఉష్ణోగ్రత పెరుగుతోంది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతున్నందున 1850 నుంచి భూగోళ సగటు ఉష్ణోగ్రత 1.3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. ఇంతవరకు నమోదైన వాతావరణ గణాంకాల ప్రకారం అత్యధిక ఉష్ణ సంవత్సరంగా 2023 రికార్డులకెక్కింది. 2030 కల్లా కర్బన ఉద్గారాలను 43 శాతం తగ్గించకపోతే భూగోళం నిప్పుల కొలిమిలా మారుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Close