-->

ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ - ఆర్టికల్ 324ఏ - April 2024 Current Affairs.

Also Read



లోకసభ , అసెంబ్లీ ఎన్నికలతోపాటే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ ఆర్టికల్ 324ఏ చేర్చాలి. దానివల్ల ఆర్టికల్ 243ఈ, 243యూలతో సంబంధం లేకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు సార్వత్రిక ఎన్నికలతోపాటే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుంది. ఒకవేళ వాటి కాల పరిమితి ఐదేళ్లలోపే ముగిస్తే వాటికి మధ్యంతర ఎన్నికలు నిర్వహించి, మిగిలిన కాల పరిమితి వచ్చే సాధారణ ఎన్నికల వరకే ఉండేలా నిర్దేశించాలి.

తొలి దశలో లోక్ సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. రెండోదశలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో కలపాలి. అందుకోసం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోపు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలి.

ప్రధాన ఎన్నికల కమిషనర్ నుంచి జాబితా తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఓటర్ల జాబితాలు తయారు చేస్తుంటాయి. కొన్నిచోట్ల రాష్ట్ర ఎన్నికల సంఘాలు సొంతంగానే వాటిని తయారు చేసుకుంటుంటాయి. దీనివల్ల ఒకే పని రెండు సార్లు చేసినట్లవుతోంది. దీన్ని పరిహరించడానికి మూడంచెల వ్యవస్థ కోసం ఒకే ఓటర్ల జాబితా తయారుచేసి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల పనిని తగ్గించాలి. ఇందుకోసం ఆర్టికల్ 325ని సవరించాలి.

జమిలి ఎన్నికల నిర్వహణకు ఎన్ని ఈవీఎంలు, వీవీప్యాట్లు, సిబ్బంది, భద్రతా దళాలు, సరంజామా అవసరమవుతుందో కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. అందుకయ్యే వ్యయ అంచనాలనూ సమర్పించింది. జమిలి ఎన్నికలపై తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ అంచనాలను సవరించాల్సి ఉంటుంది. ఇందుకు అనువైన ప్రణాళిక తయారు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘాలు పని చేయాలి.

2024లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: జూన్ నాటికి ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా. నవంబరు నాటికి హరియాణా, మహారాష్ట్ర.

2025లో ..ఝార్ఖండ్, బిహార్, దిల్లీ.

2026లో..పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి,

2027లో..మణిపుర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్.

2028లో.. హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్.

గతంలోనూ జమిలి: దేశంలో గతంలోనూ జమిలి ఎన్నికలు జరిగాయి. స్వాతంత్ర్యం వచ్చాక 1951-52లో తొలి ఎన్నికలను లోక్సభ, అసెంబ్లీలకు కలిపి నిర్వహించారు. దీనిని 1967 వరకూ కొనసాగించారు. 1968, 69 సంవత్సరాల్లో కొన్ని అసెంబ్లీలను రద్దు చేయడంతో జమిలి తప్పింది. 1970లో లోక్సభనూ అర్ధాంతరంగా రద్దు చేశారు. అప్పటి నుంచి వేర్వేరుగా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. మళ్లీ 1980లో జమిలి ఎన్నికల ప్రతిపాదన వచ్చింది. 1983లో జమిలి ఎన్నికలను నిర్వహించాలని ఆలోచన చేశారు. 1999లో జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్.. తన 170వ నివేదికలో జమిలి ఎన్నికల సూచన చేసింది. 2003లో అప్పటి ప్రధాని వాజ్పేయీ జమిలి ఎన్నికల ఆలోచన చేశారు. తన ఆలోచనను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పంచుకున్నారు. ఆమె అంగీకరించారు. కానీ అది ఆచరణకు నోచుకోలేదు. 2010లో భాజపా నేత ఆడ్వాణీ కూడా జమిలి ప్రతిపాదన తెచ్చారు.

అప్పటి ప్రధాని మన్మోహన్కు ఈ ప్రతిపాదన చేశారు. 2014లో భాజపా తన ఎన్నికల ప్రణాళికలో జమిలి అంశాన్ని ప్రస్తావించింది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు సుదర్శన్ నాచియప్పన్ నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీని 2015లో ఏర్పాటు చేసింది. 2017లో నీతి ఆయోగ్ ఒక పత్రాన్ని తయారు చేసింది. 2018లో లా కమిషన్ మరో పత్రాన్ని రూపొందించింది. కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాలని సూచించింది.

Close