-->

భేతాళ కథలు - విక్రమార్కుడు వేటకు బయలుదేరుట - Stories of Bethala - Vikramarka sets out for hunting

Also Read



విక్రమార్కుని పరిపాలనలో ఉజ్జయినీ నగరం మిక్కిలి ఉన్నత స్థితికి వచ్చింది. విక్రమార్కుడు ధర్మము తప్పకుండా ప్రజలను పోషించాడు. ప్రజలకు ఏ హానీ రానీకుండా కంటికి రెప్పలా కాపాడుచుండేవాడు. విద్వాంసులను, పండితులను, కవులను, కళాకారులను ఆదరిస్తూ వారి ఆశీర్వాదములు పొందుచుండేవాడు. వేయేల, విక్రమార్కుడు రెండవ ఇంద్రుడా! అన్నట్లు మహా భోగభాగ్యాలతో ప్రసిద్ధి గాంచాడు.

ఒక నాడు విక్రమార్కుడు మంత్రియైన భట్టితో, విలువిద్యానిపుణులైన వేటగాండ్రతో వేటకు బయలుదేరాడు. ఉజ్జయినీ నగరానికి పరిసరారణ్యంలో "క్రూరమృగ సంచారం" ఎక్కువ ఆగుటచే సమీప గ్రామవాసులు భయపడి మహా రాజుకు విన్నవించుకొన్నారు. అందువలననే- వేటకు బయలుదేరాడు విక్ర మార్కుడు. క్రూరమృగములను ఆయాప్రాంతాలలో నివసించే గిరిజనులకు సౌఖ్యము కలిగించాలని.

విక్రమార్కుడు వేటకు తగిన వస్త్రధారణ గావించుకొని, రధమునెక్కి బయలుదేరాడు. ఆయన వెనుక రధముపై భట్టి ఆ తరువాత విలుకాండ్రు, వేటకాండ్రు, వేటకుక్కలు -చిక్కములు, వలలు మొదలగువానితో పరిజనులు, బయలు దేరారు. మృగములను చప్పుడు చేసి బయటకు రప్పించుటకు కావలసిన వాయిద్యములతో కొంతమంది సేవకులుకూడ బయలు దేరారు.

విక్రమార్కుడు మిక్కిలి చాకచక్యముతో-క్రూరమృగములను హత మార్చినాడు; ఆయా గిరిజన ప్రాంతీయులకు మృగబాధ లేకుండా చేసినాడు. ఆయా గిరిజన ప్రజలు మిక్కిలి ఆనందించి, మహారాజు మెచ్చునట్లు తమ సంతోషం ప్రకటించుచు నృత్యగానములచే విక్రమార్కుని ఆనందపరచినారు. విక్ర మార్కుడు తిరిగి నగరానికి బయలు దేరినాడు.

Close