-->

బ్రోకర్లు చెప్పే మాయమాటలు, చేసే అకృత్యాలు - Tricks and misdeeds of brokers - Stock Market

Also Read



స్టాక్ మార్కెట్లో దెబ్బతినని వారు చాలా తక్కువ. సరే ఒకసారి దెబ్బతిన్నాక బుద్ది వచ్చిందికదా అని మన పని మనం చేసుకుంటుంటాం. ఓ సుప్రభాతాన బ్రోకర్నుండి మనకు ఫోన్ వస్తుంది. “సార్! మార్కెట్ పెరిగిపోతుంది. గతంలో మీరు పోగొట్టుకున్నారు కదా! ఇది సరైన సమయం అంతా తిరిగి సంపాదించు కుంటున్నారు సార్” అంటాడు. మనలో అణగారిపోయిన ఆశలు తిరిగి మొగ్గతొడుగుతాయి. ఓ ఫైన్ మార్నింగ్ మనం కూడా తిరిగి స్టాక్ మార్కెట్లో అడుగుపెడతాం. ఫలితంగా సాలెగూడులో చిక్కుకుపోతాం.

కొంతమంది బ్రోకర్లు తమ బిజినెస్ పెంచుకోవడానికి తమకు అద్భుతమైన టిప్ వచ్చిందని చెప్పి వారి చేత షేర్లను కొనిపిస్తారు. అది పెరగకపోతే, మార్కెట్ బాగోలేదనో, మరేదో చెప్తారు.

ఇంకొంతమంది ఆన్లైన్ సదుపాయం వున్న బ్రోకర్లు - కష్టమర్ల అక్కౌంట్లో తమ స్వంత బిజినెస్ చేసుకుంటారు. తద్వారా నష్టం వస్తే బిచాణా ఎత్తేసి పారిపోతారు.

ఇంకొంత మంది బ్రోకర్లు మనకు ఇవ్వాల్సిన చెక్కు వాయిదావేస్తుంటారు. ఈ లోపు కస్టమర్ మళ్ళీ కొత్త షేర్లు కొంటే వాటిని తమ జమలో వేసుకోవచ్చని వారి ప్లాన్.

అయితే అందరు బ్రోకర్లు అలా చేస్తారని చెప్పడం మా అభిమతం కాదు. కొద్దిమంది దురాశపరులు అలా చేసి ఇన్వెస్టర్ని పీడిస్తారు. ఇంకొంత మంది బ్రోకర్లు ఉంటారు. ఇన్వెస్టర్కి ఫలానా షేర్లో లాభం వచ్చిందని తెలియగానే దానిని మరో షేర్లో మింగేద్దామనుకుంటారు. అందుకే ఏదోక టిప్ వచ్చిందని చెప్పి మళ్ళీ వాటిని కూడా ఇంకో షేర్లలో పెట్టుబడి పెట్టించి తమ కమీషన్ని పెంచుకుంటారు.

కాబట్టి ఇన్వెస్టర్ ఈ క్రింది చర్యలు తీసుకోవాలి.

1. మీ బ్రోకర్ నమ్మకస్తుడా, కాదా అన్నది ఎంక్వయిరీ చేయాలి. ఎంక్వయిరీకి తోడు అనుభవం కూడా ముఖ్యం. అనుభవం వల్ల ఆ మనిషి ఎలాంటివాడో తెలుస్తుంది.

2. నమ్మకమైన బ్రోకర్ ఎప్పుడూ - ఇన్వెస్టర్ని స్టాక్ మార్కెట్ అంటేనే రిస్తో కూడిన వ్యవహారమని, అలాంటి వాటిలోకి అమాయక ఇన్వెస్టర్లని దిగకూడదని చెప్తారు.

3. అన్నింటికీ మించి మీ బ్రోకర్ కేవలం క్లయింట్ల బిజినెస్ మాత్రమే చేసేవాడై ఉండాలి. తాను కూడా షేర్ల బిజినెస్ చేసి కోట్లకు పడగలెత్తాలన్న మనస్తత్వంతో ఉండకూడదు. అలా తనకు తాను స్పెక్యులేషన్ బిజినెస్ చేసుకున్నవాడు తాను మునిగిపోవడమేకాక క్లయింట్ల డబ్బుతో కూడా స్పెక్యులేషన్ చేసి దివాళా తీసి చేతులు ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి.

Close