-->

నా జీవిత యాత్ర టంగుటూరి "ప్రకాశం" పంతులు (ఆగష్టు 23, 1872 – మే 20, 1957)

Also Read



టంగుటూరి ప్రకాశం' పంతులు (ఆగష్టు 23, 1872 – మే 20, 1957) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు.

1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.

లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు. 1921 డిసెంబర్‌లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనాడు. ఏదైనా అలజడి కానీ, కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు. ఈయన అకాలీ సత్యాగ్రహమప్పుడు పంజాబ్ ప్రాంతంలో, హిందూ-ముస్లిం ఘర్షణలు తలెత్తినపుడు ముల్తాన్ లోనూ పర్యటించాడు. కేరళలో మోప్లా తిరుగుబాటు సమయములో బయటిప్రాంతాల వారిపై నిషేధం విధించినా లెక్కచేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి, పర్యవసానంగా ఊటీ లోని తన ఆస్తిని ప్రభుత్వానికి కోల్పోయాడు. 1922లో సహాయనిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో 30,000 మంది స్వచ్ఛందకులతో ఒక ప్రదర్శనను నిర్వహించాడు. 1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనాడు. అక్కడ విఠ్ఠల్‌భాయి పటేల్, మదన్ మోహన్ మాలవ్యా, జిన్నా, జి.డి.బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు.

1937లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చినపుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగాడు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. స్వంతపార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక, పార్టీ నుండి బయటకు వచ్చి, స్వంతంగా ప్రజాపార్టీని స్థాపించాడు.

1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశాన్ని అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు. 1945లో జైలునుండి విడుదలైన తర్వాత, ప్రజలకు చేరువకావటానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించాడు. 1946లో కాంగ్రెస్ పార్టీ తిరిగి మద్రాసు ప్రెసిడెన్సీలో పోటీచేసి గెలిచింది. ఈ తరుణంలో 1946 ఏప్రిల్ 30న ప్రకాశం మద్రాసు ముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. ఈయనతో పాటు తమిళ నాయకుడైన కె.కామరాజ్, జాతీయ నాయకులైన గాంధీ, నెహ్రూల అభ్యర్థి అయిన రాజాజీ ముఖ్యమంత్రి అవటాన్ని వ్యతిరేకించారు. అయితే, పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం కేవలం 13 నెలలే మనగలిగింది.

1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించటంతో ఉద్యమం తీవ్రతరమైంది. ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్‌ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా నది పై బారేజి నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి. కమ్యూనిస్టులు ఈయన పాలనను వ్యతిరేకించటం, సామ్యవాదులు మద్దతు ఉపసంహరించటం వలన ముఖ్యమంత్రి అయిన 14 నెలలకే అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది.

1955లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాలనుండి విరమించుకున్నాడు.

 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. ప్రకాశం అనుయాయి అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినాడు. రాజకీయాలనుండి వైదొలిగినా, ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించాడు. అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు. అక్కడే ప్రకాశం 1957, మే 20న పరమపదించాడు.

ఆయన ఆత్మకథ "నా జీవిత యాత్ర" పేరిట నాలుగు భాగాల పుస్తకంగా విడుదల అయింది. ఇందులో మూడు భాగాలను ఆయన వ్రాయగా, నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం వ్రాసాడు. దీనిలో స్వాతంత్ర్యోద్యమ నాయకుల మనస్తత్వాలు, అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి. తెలుగు సమితి హైదరాబాదు 2006 ఆగష్టులో ప్రచురించింది. ఈ పుస్తకం హిందీ లోకి కూడా అనువదింపబడింది.
స్వాతంత్ర్య సమరయోధునిగా ప్రకాశం యొక్క ఉత్తరదాయిత్వం నేటికీ ఆంధ్ర దేశములో వెలుగొందుతూ ఉంటుంది.

టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. గుంటూరు జిల్లాలో మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), నెల్లూరు జిల్లాలో నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లాలో రెండు తాలూకాలు (మార్కాపురం, గిద్దలూరు) కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు.

Close