-->

భారతదేశం-సహజ ఉద్భిజ సంపద - India - Natural Vegetation

Also Read



భారతదేశంలో దట్టమైన ఆయనరేఖా సతత హరితారణ్యాలు మొదలుకొని తుప్పలు, పొదలతో కూడిన ఎడారి సహజ ఉద్భిజ సంపద కూడా కనిపిస్తుంది. విశాల భౌగోళిక విస్తీర్ణం, వైవిధ్యభరితమైన నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి దీనికి ప్రధాన కారణం. హిమాలయ ప్రాంతంలో తప్ప మిగిలిన భారతదే శంలో వర్షపాత విస్తరణ సహజ ఉద్భిజ సంపదను నియంత్రిస్తుంది. హిమాలయ ప్రాంతం ఎత్తు, వాలు సహజ ఉద్భిజ సంపదను ప్రభావితం చేస్తాయి.

భారతదేశంలో సుమారు 23 శాతం భౌగోళిక ప్రాంతంలో అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. దట్టమైన అరణ్యాల వాటా మాత్రం కేవలం 16 శాతం. వీటి విస్తరణలో ప్రాంతీయ వ్యత్యాసాలు ఉన్నాయి. ఈశాన్య భారతదేశం, తూర్పు, మధ్య భారతదేశంలోని కొండలు, పీఠభూములు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, అండమాన్, నికోబార్ దీవుల్లో అరణ్యాలు కేంద్రీకృతమై ఉన్నాయి. కేరళ, కర్ణాటకలకు చెందిన పశ్చిమ కనుమలు, అండమాన్, నికోబార్ దీవులు, షిల్లాంగ్ పీఠభూమి ప్రాంతాల్లో ఉష్ణమండల పాక్షిక సతత హరితారణ్యాలు పెరుగుతున్నాయి. ఇవి దట్టమైన అరణ్యాలు. మహాగని, జిట్రేగి ప్రధాన వృక్షజాతులు. వీటిలో జీవ వైవిధ్యత అత్యధికంగా ఉంది. వీటి నుంచి వాణిజ్య కలప ఉత్పత్తి కష్టం. పశ్చిమ కనుమల్లో నిర్మిస్తున్న జల విద్యుచ్ఛక్తి కేంద్రాలు వీటికి హాని కలిగి స్తున్నాయని పర్యావరణ శాస్త్రజ్ఞులు ఆందోళన చెందుతున్నారు. కేరళలోని సైలెంట్ వ్యాలి జల విద్యుచ్ఛక్తి కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా పెద్ద ఆందో ళన జరిగింది.

ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని 'తెరాయి' మండలం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పశ్చిమ ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో ఉష్ణమండల ఆకురాల్చే అరణ్యాలు పెరుగుతున్నాయి. టేకు, సాల్, గుర్జన్, అర్జున్, హల్లు, తెల్టు ముఖ్యమైన వృక్ష జాతులు. ఇవి కూడా దట్టమైన అరణ్యాలు. భారతదేశంలో వాణిజ్య కలప ఉత్పత్తి ప్రధానంగా ఈ అరణ్యాల నుంచే అవుతుంది. వెదురు, సలాయి వంటి గడ్డి జాతులు కూడా ఈ అరణ్యాల్లో పెరుగుతున్నాయి. పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్ లోని కథయావాడ్, పశ్చిమ మహారాష్ట్ర, తమిళనాడు, దక్షిణ కర్ణాటక పీఠభూమి ప్రాంతాల్లో అనార్థ ఆకురాల్చే అరణ్యాలు పెరుగు తున్నాయి. ఇవి ఆర్థ ఆకురాల్చే అరణ్యాలంత దట్ట మైనవి కావు. ఈ అరణ్యాలు పెద్దమొత్తాలలో నరికి వేతకు గురవుతున్నాయి.

సహ్యాద్రి కొండల పవన పరాన్ముఖ దిశలో వర్షచ్ఛాయా ప్రాంతం ఏర్పడింది. ఈ పాక్షిక శుష్క మండలం మరట్వాడా, విదర్భ, ఉత్తర కర్ణాటక, పశ్చిమ తెలంగాణ, రాయలసీమల్లో విస్తరించి ఉంది. ఈ మండలంలో ముళ్లపొదలతో కూడిన చిట్టడవులు పెరుగుతున్నాయి. ఈ చిట్టడవులు వాణిజ్య కలప ఉత్పత్తికి పనికిరావు. ఈ అడవుల నుంచి వంట కలప ఉత్పత్తి అవుతుంది. చిన్న ఆకులు, ముళ్లతో కూడిన అకేషియా (తుమ్మ) జాతికి చెందిన వృక్షాలు ఇక్కడ పెరుగుతున్నాయి. ఉత్తర గుజరాత్, పశ్చిమ రాజస్థాన్‌కు చెందిన శుష్కమండలంలో కాక్టస్ జాతికి చెందిన బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి పొదలు, తుప్పలు పెరుగుతాయి. ఇవి అధిక ఉష్ణోగ్రత తట్టుకొనే మెగాథర్మ్ కుటుంబానికి చెందినవి. శుష్కతను తట్టుకొనే ఈ వృక్ష జాతులను జెరో ఫైట్లుగా కూడా వ్యవహరిస్తారు. ద్వీపకల్ప భారతదేశంలోని నీలగిరి, అన్నమలై, పళని మహదేవ కొండల శిఖర భాగాల్లో సమ శీతోష్ణ మండల అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఓక్, చెస్ట్నట్, మాపుల్ మొదలైనవి ఈ అరణ్యాల్లో ముఖ్య వృక్షజాతులు. ఈ అరణ్యాలను దక్షిణ భారతదేశంలో 'షోలా' అరణ్యాలుగా పిలుస్తారు.

తీరప్రాంతంలో ప్రత్యేక రకమైన మడ అరణ్యాలు(మాన్ గ్రూప్స్) పెరుగుతున్నాయ. నదీ ము ఖద్వారాలు, తీరప్రాంతపు సరస్సులు, లాగూన్ల వద్ద ఇవి పెరుగుతాయి. అరణ్యాలలోని వృక్షజాతులు నీటి ముంపును, లవణీయతను తట్టుకొనే ధర్మం కలిగి ఉంటాయి. ఈ వృక్షాలు నీటిలో తేలియాడుతుంటాయి. బులుసు, సుందరి, ఉప్పు పొన్న ముఖ్యమైన వృక్షజాతులు. సుందరవనాలు (పశ్చిమ బెంగాల్), పాయింట్ కాలిమోర్, పిచ్ఛవరం (తమిళనాడు), పెంబనాడు (కేరళ), కొండాపూర్ (కర్ణాటక), కోరింగ(ఆం ధ్రప్రదేశ్), రత్నగిరి (మహారాష్ట్ర)లను రక్షిత మడ అరణ్యాల ప్రాంతాలుగా గుర్తించారు. మడ అడవులు తీర రేఖ స్థిరీకరణకు దోహదపడతాయి. తీరప్రాంతాలను తుపానులు, సునామీల బారి నుంచి రక్షించటానికి కూడా ఈ అరణ్యాలు దోహదపడతాయి.

హిమాలయ పర్వత సానువుల్లో ఎత్తును అనుసరించి వివిధరకాల అరణ్య మండలాలు విస్తరించి ఉన్నాయి. శివాలిక్ కొండల సానువుల్లో ఆర్ద్ర ఆకురాల్చే అరణ్యాలు పెరుగుతున్నాయి. టేకు, సాల్ వృక్ష జాతులు ఇక్కడ పెరుగుతున్నాయి. 1000-2000 మీటర్ల ఎత్తులో లెస్సర్ హిమాలయ దిగువ భాగాల్లో సమశీతోష్ణ మండల అరణ్యాలున్నాయి. ఓక్, చెస్ట్నట్, బీచ్, మాపుల్ వృక్షజాతులు ఉన్నాయి. 2000-3500 మీటర్ల ఎత్తులో మెత్తని కలపనిచ్చే శృంగాకార అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఇవి కోనిఫెరస్/టైగా జాతికి చెందిన అరణ్యాలు. పైన్, ఫర్, స్పూృస్, సెడార్ (దేవదారు) ముఖ్య వృక్షజా తులు. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే మెత్తని కలపను మేలిరకం న్యూస్ ప్రింట్ తయారీకి వాడతారు. సుమారు 4000 మీటర్ల ఎత్తులో ఆల్ఫైన్ తరగతికి చెందిన సహజ ఉద్భిజ సంపద పెరుగుతుంది. ఈ మండలంలో దట్టమైన పచ్చికబయళ్లు, కురచయిన విల్లో వృక్షాలు, వివిధరకాల పుష్పజాతులు(రోడో డెండ్రాన్) ఈ మండలంలో పెరుగుతున్నాయి. ఈ ఆల్ఫైన్ మండలం సహజసిద్ధ ఉద్యానవనాన్ని తలపిస్తుంది. ఈ మండలాలలో వివిధ రకాల విలువైన ఔషధ మొక్కలు విశేషంగా పెరుగుతాయి.

Close