-->

అడవులు - Forest Geography

Also Read

అడవులు

సహజ శీతోష్ణస్థితి, నైసర్గిక స్వరూపం, నేలలు, నదీ ప్రవాహాలకు అనుగుణంగా ఏదో ఒక భౌగోళిక ప్రాంతంలో పెరిగే వృక్ష జాలాన్నే సహజ ఉద్భిజ్జ సంపదగా పరిగణిస్తారు. ఈ సహజ ఉద్భిజ సంపదను నిర్దేశిత ప్రాంతంలోని అక్షాంశ ఉనికి, ఎత్తు, నేలలు, శీతోష్ణస్థితి నిర్ధారి స్తాయి. సహజ ఉద్భిజ్జ సంపద ప్రధానంగా దట్టమైన అడవులు, చిట్టడవులు, గడ్డి మైదానాలు, పొదల రూపంలో ఉంటుంది. సాధార ణంగా అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం సంభవించే ప్రాంతాల్లో సహజ ఉద్భిజ సంపద దట్టమైన అరణ్యాల రూపంలో పెరుగుతుంది. సాధారణంగా వృక్షజాలం పెరగడానికి అతిశీతల ప్రాంతాలు, శుష్క ప్రాంతాలు అనుకూలం కాదు. దీంతో ఈ ప్రాంతాలే ఎడారులుగా రూపొందాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థలు, సంస్కృతిపై సహజ ఉద్భిజ్జ సంపద ప్రభావం విశేషంగా ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో పెరిగే వృక్షజాలం ఆయా మానవ సమాజాలకు ప్రధానమైన సహజ వనరులుగా ఏర్పడ్డాయి. ఆవరణ వ్యవస్థల్లో వృక్షజాలం పాత్ర కీలకం.అయితే పారిశ్రామిక విప్లవం సంభవించిన తర్వాత ప్రపంచ సహజ ఉద్భిజ్జ సంపద తీవ్రమైన కాలుష్యానికి గురవడమే కాక.. అడవులు, గడ్డి మైదానాలు ఆక్రమణ, నరికివేతలకు గురయ్యాయి. ఇది ప్రపంచ పర్యావరణానికే ముప్పుగా పరిణమించింది.
    భూమధ్య రేఖ ప్రాంతాలు, రుతుపవన మండలాల్లో మాత్రమే ఇప్పటికీ దట్టమైన అడవులు విస్తారంగా పెరుగుతున్నాయి. భూ మధ్య రేఖా ప్రాంతంలో సంవత్సరం పొడవునా అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతం సంభవిచటంవల్ల దట్టమైన సతత హరితారణ్యాలు పెరుగు తున్నాయి. వీటిని 'సెల్వాటి'గా పిలుస్తారు. ఇవి ప్రధానంగా దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌కు చెందిన అమెజాన్ నదీ హరివాణం, పశ్చిమ ఆఫ్రికాలోని కాంగో నదీ పరివాహక ప్రాంతంలో పెరుగుతున్నాయి. ఈ సతత హరితారణ్యాలలో మూడంచెల వృక్ష వ్యవస్థ విశిష్టంగా కనిపిస్తోంది. అంతేకాక ఈ అరణ్యాల్లో సూర్యకిరణాలు కూడా చొరబ డవు. దీంతో అటవీ భూతలం చిత్తడి నేలలతో కూడి ఉంటుంది. జీవ వైవిధ్యత బాగా అభివృద్ధి చెందిన ప్రాంతమిది.
    ఆయనరేఖా ప్రాంతాల్లో, ఖండాల తూర్పు భాగాల్లో దట్టమైన రుతుపవన అడవులు పెరుగుతున్నాయి. ఇవి ఆకురాల్చే తరగతికి చెందుతాయి. ఈ అరణ్యాల్లో టేకు, సాల్ వృక్ష జాతులు ప్రధానంగా కనిపిస్తాయి. వెదురు, సబాయి, సలాయి వంటి గడ్డి జాతులు కూడా విస్తారంగా పెరుగుతున్నాయి. భారత్, మయన్మార్, కంబోడియా, థాయ్ లాండ్, వియత్నాంలలో రుతుపవన అడవులు ముఖ్యంగా కేంద్రీకృతమయ్యాయి. ఆయన రేఖ, ఉప ఆయన రేఖ ప్రాంతాల్లో ఖండాతర్భాగాల్లో పాక్షిక, శుష్క శీతోష్ణస్థితి వల్ల గడ్డి మైదానాలు పెరుగుతున్నాయి. ఈ ఆయన రేఖా గడ్డి మైదానాలను తూర్పు ఆఫ్రికాలో 'సవన్నాలు'గా వ్యవహరిస్తారు. బ్రెజిల్ పీఠభూములకు చెందిన కాంపాలు, వెనిజులాలోని 'లానోలు' కూడా ఈ తరగతికే చెందుతాయి. ముఖ్యంగా సవన్నా గడ్డి భూములు విశిష్టమైన వన్య మృగ సంపదకు ప్రసిద్ధి. సవన్నా మండలాన్ని 'హంటర్స్ ప్యారడైజ్, బిగ్ గేమ్ కంట్రీ రీజాన్'గా కూడా వ్యవహరిస్తారు. మధ్య అంక్షాశాల్లోని ఖండాతర్భాగాల్లో కూడా కవోష్ణ, పాక్షిక, శుష్క శీతోష్ణస్థితి వల్ల సమశీతోష్ణ గడ్డి మైదానాలు పెరుగుతాయి. అయితే ఈ మండలాల్లోని గడ్డి కురచగా, మృదువుగా ఉంటుంది. వీటిని వివిధ ప్రాంతాల్లో స్టెప్పీలు, పంపాలు, ప్రయరీలు, వెల్ట్ లు, డౌన్లుగా వ్యవహరిస్తారు. మధ్య ఉన్నత అక్షాంశాల్లో ఖండాల తూర్పు పశ్చిమ భాగాల్లో దట్ట మైన సమశీతోష్ణ మండల అడవులు పెరుగుతాయి. ఉత్తర అమెరికా, ఐరోపా, ఖండాల్లోని ఈ సమశీతోష్ణ మండల అడవులు పంతొ మ్మిది, ఇరవై శతాబ్దాల్లో భారీగా నరికివేతకు గురయ్యాయి. 60 డిగ్రీల అక్షాం శాల సమీపంలో ఉత్తరార్ధ గోళంలో ఖండాతర్భాగాల్లో ఖండాతర శీతో ష్ణస్థితి వల్ల ప్రత్యేక తరగతికి చెందిన టైగా అడవులు పెరుగుతు న్నాయి. ఈ అడవులు కొనిఫెరస్ జాతికి చెందిన వృక్షజాతులతో కూడి ఉన్నాయి. ప్రైన్, ఫర్, స్పూస్, దేవదారు ముఖ్య వృక్ష జాతులు. ఈ వృక్షాలు శంఖం ఆకారంలో ఉంటాయి. ఆకులు సూదిమొన తేలి ఉంటాయి. ఈ వృక్షజాతులు మృదువైన కలపనిస్తాయి. నాణ్యమైన న్యూస్ ప్రింట్ కాగితాల తయారీకి ఈ కలపను వినియోగిస్తారు.
    భారతదేశంలో సహజ ఉద్భిజ్జ సంపద వైవిధ్యంగా ఉంటుంది. మధ్య భారతదేశం, తూర్పు భారతదేశంలోని పీఠభూములు, ఈశాన్య భారతదేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. పీఠభూముల అంతర్భాగాలు, వాయ వ్య భారత దేశంలో పాక్షిక శుష్క శీతోష్ణస్థితి వల్ల చిట్టడవులు పెరుగు తున్నాయి. సహ్యాద్రి కొండల పశ్చిమ వాలులు, కేరళ కొండల్లో అత్య ధిక వర్షపాతం సంభవించడంతో దట్టమైన వర్షపాత అడవులు పెరు గుతున్నాయి. ఇవి ఆర్ధ ఆకురాల్చు అరణ్యాల తరగతికి చెందుతాయి. ఎత్తైన కొండల శిఖర భాగాల్లో సతత హరితారణ్యాలు కూడా ఉన్నాయి. ఓ మోస్తరు వర్షపాతం కురిసే ప్రాంతాల్లో పలుచగా ఉండే అనార్థ ఆకురాల్చు అడవులు కనపడతాయి. పశ్చిమ రాజస్థాన్ లోని థార్ ఎడారి ప్రాంతంలో శుష్కత వల్ల తుప్పలు, పొదలు కనపడ తాయి. బ్రహ్మజెముడు, నాగజెముడు ప్రధాన జాతులు. ఇవి జెరో ఓ సైట్ తరగతికి చెందినవి. దక్కన్ పీఠభూమి అంతర్భాగాల్లో పాక్షిక శుష్కత వల్ల సహజ ఉద్భిజ్జ సంపద సవన్నా జాతి లక్షణాలు కలిగుంటుంది.
    తీర ప్రాంతాల్లోని నదీ ముఖ ద్వారాలు, నీటికయ్యల వద్ద ప్రత్యేక రకమైన మడ అడవులు పెరుగుతాయి. వీటిని 'మాన్ గ్రూత్'గా పిలుస్తారు. ఇవి హైడ్రోఫైట్ తరగతికి చెందుతాయి. రైజోఫెరా జాతికి చెందిన వృక్ష జాతులు ఇక్కడ పెరుగుతాయి. భారతదేశంలో సహజ ఉద్భిజ్జ సంపద, వన్యమృగ సంపద పరిరక్షణ కోసం ముఖ్యమైన అరణ్య మండలాల్ని జాతీయ ఉద్యానవనాలు, రక్షిత వన్యమృగ సంరక్షణ కేంద్రాలుగా ప్రకటించారు. సమగ్ర జీవ వైవిధ్యత, ఆవరణ వ్యవస్థల పరిరక్షణ, శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశంతో కొన్ని అరణ్య ప్రాంతాలను 'రక్షిత జీవ మండలాలు'గా అభివృద్ధి చేస్తున్నారు.

Close