-->

భారత ఆర్ధిక వ్యవస్థ లక్షణాలు వివరించండి? - Describe the features of the Indian economy?

Also Read



    భారత ఆర్ధిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతూ ఉన్న ఆర్ధిక వ్యవస్థ అన్ని లక్షణాలను కల్గి ఉంది. ఈ విషయాన్ని మరింత విపులంగా అర్ధం చేసుకోవడానికి భారత ఆర్ధిక వ్యవస్థ లక్షణాలను పరిశీలిద్దాం.

1) తక్కువ ఆదాయస్థాయి

భారత జాతీయ తలసరి నికర ఆదాయం 1995-96 వ సంవత్సరంలో రూ. 9,300/-లు. ఇది ప్రపంచములోని చాలా దేశాల కంటే అతి తక్కువ. ప్రపంచములోని 133 వెనుకబడిన దేశాలలో ఇండియా 110 వ స్థానంలో ఉన్నది
    అనగా మన కన్నా 109 దేశాలు ఎక్కువ తలసరి ఆదాయాన్ని అనుభవిస్తున్నాయి. తక్కువ ఆదాయస్థాయి, తక్కువ జీవన ప్రమాణాన్ని, తక్కువ వినియోగాన్ని సూచిస్తుంది. దేశంలో మూడు వంతుల జనాభా పేదరికపు రేఖ దిగువ భాగమున జీవించుచున్నారు. వీరు కనీస పౌష్టిక ఆహారం పొందలేక పోతున్నారు. అందువలన శ్రామిక ఉత్పాదక సామర్థ్యం కూడా తక్కువగా ఉన్నది.

2) వ్యవసాయ రంగ ప్రాధాన్యత

    భారతదేశంలో 2/3 వంతు మంది శ్రామికులు వ్యవసాయ రంగం పై ఆధారపడి పనిచేస్తున్నారు. మన దేశ జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా 30 శాతం ఉన్నది. కానీ అభివృద్ధి చెందిన దేశాలలో జాతీయాదాయంలో వ్యవసాయరంగం వాటా 2శాతం నుండి 4 శాతం మాత్రమే. ఇదే విధంగా అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయరంగంలో పనిచేస్తున్న శ్రామికులు 2 నుండి 9 శాతం మాత్రమే. మనదేశంలో వ్యవసాయరంగం చాలా భాగం వర్షాలపై ఆధారపడి ఉన్నది. వ్యవసాయ రంగంలో ఉపయోగించే ఉత్పత్తి పద్ధతులు చాలా పురాతనమైనవి. మనదేశంలో కొన్నిచోట్ల ఆధునిక పద్ధతులలో వ్యవసాయం జరుగుతున్నప్పటికీ ఎక్కువ శాతం పాత ఉత్పత్తి పద్ధతులపై ఆధారపడి ఉన్నది. నీటి పారుదల సౌకర్యములు లేని భూమి కూడా చాలా ఉన్నది.

3) మూలధన కొరత

    మన ఆర్ధిక వ్యవస్థలో ప్రజల ఆదాయాలు తక్కువ. అందుచే పొదుపు తక్కువ. పెట్టుబడి తక్కువ, ఫలితంగా మూలధన సంచయనం తక్కువ. మూలధనం కొరత వలన, ఇతర ఉత్పత్తి కారకాలైన శ్రామికులు, సహజవనరులు నిరుపయోగంగా ఉన్నాయి. మనదేశంలో పునరుత్పత్తి చెయ్యగల సహజ వనరులు, పునరుత్పత్తి చెయ్యలేని సహజవనరులు రెండూ పుష్కలంగానే ఉన్నప్పటికీ, మూలధనం కొరత వలన వనరుల అవినియోగిత ఎక్కువగా ఉన్నది.

4) సాంకేతిక పరిజ్ఞానం కొరత

    మన ఆర్ధిక వ్యవస్థ చాలా రంగాలలో వెనుకబడిన ఉత్పత్తి పద్ధతులు ఉపయోగిస్తున్నారు. పరిశోధనల పైన, అభివృద్ధి పధకాల పైన చేసే వ్యయం కూడా చాలా తక్కువగా ఉన్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అక్కడక్కడ కొన్ని కొన్ని పరిశ్రమలలో మాత్రమే కనపడుతున్నది.

5) అవ స్థాపనా సౌకర్యముల కొరత

    విద్యుచ్ఛక్తి, రవాణా, సమాచారం మొదలైన వాటిని అవస్థాపనా సౌకర్యములు అంటారు. దేశ పారిశ్రామికాభివృద్ధికి ఈ అవస్థాపనలు అవసరం. దేశములోని వ్యవసాయ రంగం పైన, సేవారంగం పైన కూడా ఇవి ప్రభావాన్ని కల్గి ఉన్నాయి. మన దేశంలో ఈ సౌకర్యాలన్ని అసంపూర్ణంగా ఉన్నాయి.

6) అధిక జనాభా పెరుగుదల రేటు

    1991 జననాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 84 కోట్లు ఉండగా, జనాభా పెరుగుదల రేటు 2.1శాతం ఉన్నది. 1951లో ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేపట్టినప్పటి నుండి దేశంలో జననాల రేటు నెమ్మదిగా, మరణాల రేటు మాత్రం వేగంగా తగ్గింది. దీని వలన జనాభా విస్ఫోటనమేర్పడి, వనరుల వినియోగితలో భారం పెరిగింది. ఫలితంగా జాతీయాదాయం పెరిగినంతగా, తలసరి ఆదాయం పెరగలేదు.

7) అధిక నిరక్షరాస్యత రేటు

    మనదేశంలో చాలా మంది ప్రజలు నిరక్షరాస్యులు. 1951 నుండి అక్షరాస్యులు పెరుగుతున్నప్పటికీ, నిరక్షరాస్యులు కూడా ఎక్కువగా ఉన్నారు. నేటికీ దేశంలో సగానికి పైగా నిరక్షరాస్యులు ఉన్నారు. ముఖ్యంగా పురుషులలో కన్నా స్త్రీలలో నిరక్షరాస్యులు ఎక్కువ.

8) అధిక శిశు మరణాల రేటు

    మనదేశంలో శిశు మరణాల రేటు అధికంగా ఉన్నది. 1995 లెక్కల ప్రకారం 1000 మందికి శిశుమరణాల రేటు 70 ఉన్నది. వైద్యసదుపాయాల కొరత, పోషక ఆహారపదార్ధాల కొరత, మురుగునీటి పారుదల సౌకర్యాల కొరత, ఆరోగ్య సదుపాయాల కొరత వలన శిశు మరణాల రేటు అధికంగా ఉన్నది.

9) సంప్రదాయ బద్ధమైన ఆలోచనలు, విధానాలు

    భారతీయ సమాజం కుల ప్రాతిపదికపై అనేక వర్ణాలుగా, వర్గాలుగా విభజితమై ఉన్నది. మత విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, ఆచార సంప్రదాయాలు, అభివృద్ధికి ఆటంకముగా నిలిచినాయి. ఉదాహరణకు పిల్లలను దేవుడిచ్చిన వరంగా భావిస్తూ కుటుంబ నియంత్రణ పద్ధతులను వ్యతిరేకిస్తారు. అదేవిధంగా వివాహానికి, పురుష సంతతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు.

10) ఉమ్మడి కుటుంబ వ్యవస్థ

    మన దేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది. ఇది శ్రామికుల గమన శీలతను అరికడుతుంది. కుటుంబసభ్యులు ఒక పక్క పేదరికాన్ని అనుభవిస్తూ మరో పక్క ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పోషిస్తూ ఉంటారు.
    పైన పేర్కొనబడిన వన్నీ భారతదేశ ఆర్ధిక వ్యవస్థ ప్రధానలక్షణాలు. కాని గత 50 సంవత్సరాల నుండి మన ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. తలసరి ఆదాయం పెరిగింది. అవస్థాపనా సౌకర్యములు పెరిగాయి. దేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతూ ఉంది. కాని జనాభా పెరుగుదల కారణంగా ఆర్థికాభివృద్ధి రేటు మందగించింది. అయినప్పటికీ బారతదేశం ఒక అభివృద్ధి చెందుతూ ఉన్న వర్ధమాన దేశంగా పేరు పొందింది. మనదేశంలో పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించినప్పటి నుండి దేశం ఆర్ధికంగా వేగాన్ని పుంజుకుంది.

Close